కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లెటర్..? ఇన్నాళ్లూ ఏం చేస్తున్నారు..?

-

తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లేఖల యుద్ధం మొదలైంది. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. అయితే ఈ లేఖ రాజకీయాలకు సంబంధించింది కాదు.. నిరుద్యోగులకు సంబంధించింది.

పోలీసు కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సంబంధించి మెరిట్ లిస్టు, కటాఫ్ మార్కులు తక్షణం విడుదల చేయాలని లేఖలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ఏళ్ల తరబడి సాగుతోంది. కానీ ఇంతవరకూ పరీక్షల ఫలితాలు వెల్లడి కాలేదు.

వీటికోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 90 వేల మంది నిరుద్యోగ యువతకు సంబంధించిన ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కోరారు. ఫలితాల విడుదల పై స్పష్టత లేక ఐదు నెలలుగా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ కు రాసిన లేఖలో తెలిపారు.

ఈ సమస్యను ఇప్పటికే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన రాలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అయినా తక్షణం జోక్యం చేసుకుని కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టు విడుదలకు డీజీపీ, బోర్డు ఛైర్మన్ లను ఆదేశించాలని డిమాండ్ చేశారు. మరి ఈ లేఖకు ప్రభుత్వం నుంచి ఎలా స్పందన వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version