ఏపీలో ప్రతిపక్ష వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల టీడీపీ, వైసీపీ నేతల మధ్య బోగోలు మండలం కోళ్ల దిన్నేలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ టైంలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో గాయపడిన టీడీపీ, వైసీపీ నేతలను ఒకే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
అదే సమయంలో వైసీపీ నేతలను పరామర్శించేందుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆస్పత్రి వెళ్లారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో వారితో అనుచితంగా ప్రవర్తించారు. కొద్దిరోజుల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఈ పోలీసు అధికారులు ఎక్కడున్నా తీసుకొచ్చి బట్టలూడదీస్తామంటూ మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై టీడీపీ నేత వంటేరు ప్రసన్న కావలి వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.