సీఎం జగన్ను మరోసారి ఫూల్ చేసే కార్యక్రమానికి టీడీపీ నేతలు శ్రీకారం చుట్టారా ? ఆయనపై తీవ్ర వ్యతిరేక ప్రచారం చేసి.. మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని విషం కక్కుతున్నారా ? “సీఎం జగన్కు ఆ మాత్రం జ్ఞానం లేదా?“ అనేలా వ్యూహం చేసుకుని ప్రచారానికి దిగారా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రతి విషయంలోనూ జగన్ను ఏదో ఒక రకంగా దుయ్యబట్టడం, ఆయనను ఎప్పటికప్పుడు బద్నాం చేయడం అనే పనిలో టీడీపీ నేతలు సక్సెస్ అవుతున్నారు. గతంలో పార్టీ ప్రచారానికి వినియోగించుకున్న సోషల్ మీడియాను టీడీపీ ఇప్పుడు జగన్పై వ్యతిరేక ప్రచారానికి బాగానే వాడుకుంటోంది.
టీడీపీ సోషల్ మీడియా వింగ్ నడుపుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. నిత్యం వెయ్యికళ్లతో జగన్ను కనిపెడుతున్నారు. ఆయన చేస్తున్న పనులపై వారు నిఘా కూడా పెడుతున్నారు. దీంతో జగన్ వేసే ప్రతి అడుగులోనూ లోపాలను ఉన్నా లేకపోయినా.. పనిగట్టుకుని ప్రచారానికి దిగుతున్నారు. తాజాగా జగన్ ముస్లింల త్యాగాలకు ప్రతీక అయిన మొహర్రాన్ని ఉద్దేశించి.. మైనార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఇది తప్పా.. ఒప్పా.. అనే విషయం పక్కన పెడితే.. సీఎం జగన్ మంచి ఉద్దేశంతోనే మైనార్టీ నేతలను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.
అయితే, మొహర్రం అనేది ఏదో విషాదకరమైన రోజని.. ఆ సమయంలో శుభాకాంక్షలు ఎలా చెబుతారని టీడీపీ సోషల్ మీడియా విభాగం రెచ్చిపోయింది. విషాద దినం అయిన ఈ రోజున శుభాకాంక్షలు చెబుతారా- అంటూ రెచ్చిపోయారు. వాస్తవానికి మన దేశంలో మంచికైనా చెడుకైనా శుభాకాంక్షలు చెప్పుకొనే అలవాటుంది! ఎంతసేపూ ఏడుస్తూ కూర్చోవడం మన దేశ సంస్కృతి కాదు. ఎవరైనా మృతి చెందిన సమయంలో వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు.. దిగులు పెట్టుకోకు.. ధైర్యంగా ఉండు.. అనే చెబుతాం
మీ జీవితాలు నాశనం అయిపోయాయి. కాబట్టి జీవితాంతం ఏడుస్తూ కూర్చోండి అని ఎవరూ చెప్పురు. ఈ క్రమంలోనే జగన్ కూడా ముస్లింలకు వారి పవిత్ర త్యాగనిరతిని ఉద్దేశించి చేసిన ప్రయోగమే శుభాకాంక్షలు తప్ప.. దీనిలో వారిని కించపరిచే ఉద్దేశం లేదని వారికి తెలుసు. కానీ, తెలియందల్లా.. పచ్చకళ్లద్దాలు పెట్టుకున్న తమ్ముళ్లకే అన్న సెటైర్లు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా విభాగం నుంచి వస్తున్నాయి.