మనోధైర్యం వీడొద్దు అని సంఘాలు, పార్టీలు, మేధావులు చెబుతున్నప్పటికీ, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాప్రయత్నాలు ఆగడంలేదు.
తెలంగాణ ప్రభుత్వం మొండిపట్టుతో వ్యవహరిస్తుండటంతో రానురాను ఆర్టీసీ కార్మికులలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. దానికి తోడు రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో నిత్యావసరాలు తీరక, నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. కోర్టులో చుక్కెదురవుతున్నప్పటికీ, దాన్ని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనే తప్ప, కార్మికుల వైపు ఒక్కసారి కూడా ప్రభుత్వం ఆలోచించడంలేదని కార్మికులు వాపోతున్నారు.
ఇదిలావుండగా, నిన్న నాగర్‌కర్నూలులో మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసాడు. కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రయివర్ సత్యారెడ్డి (35), తన డిపో పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి గొంతుకు జీఐవైర్‌తో ఉరి బిగించుకోగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఆయన్ను కాపాడి కిందకు దించారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్న సత్యారెడ్డి క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రమాదమేమీ లేదని డాక్టర్లు తెలిపారు.
హైకోర్టులో నేడు కూడా వాదోపవాదనలు జరిగాయి. ఆర్టీసీ సర్వీసులను అత్యవసర సర్వీసులుగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్మాకు సంబంధించి జీవో కూడా జారీ కాలేదని చెప్పిన ధర్మాసనం, అసలు సమ్మె చట్టబద్ధం కాదని ఎవరు చెప్పారని ప్రశ్నించింది.