ఏపీ ప్రభుత్వంలో ప్రక్షాళన మొదలైంది. ఏడాది కాలంగా ప్రభుత్వానికి ఎదురవుతున్న దెబ్బల నేపథ్యంలో సీఎం జగన్ ప్రక్షాళన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో న్యాయశాఖ ప్రక్షాళనకు ఆయన నడుంబిగించారు. వైసీపీకి ప్రజల నుంచి భారీ మెజారిటీ దక్కింది. అయితే, ప్రతిపక్షం సహా కొందరు దీనిని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై న్యాయ పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బలమైన వాదన వినిపించి.. ప్రభు త్వాన్ని ఒడ్డున చేర్చేందుకు జగన్‌కు సహకరించాల్సిన ప్రభుత్వం తాలూకు న్యాయవాదులు ఎక్కడో విఫలమవుతున్నా రనే వాదన గత కొంతకాలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం జగన్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న వారు.. సమర్ధులే అయినప్పటికీ.. మరింత సమర్ధంగా వాదించాల్సిన పరిస్థితిలో చేతులు ఎత్తేస్తున్నారన్న వాదన వైసీపీలోనూ వినిపిస్తోంది. దీంతో ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేశారు. తాజాగా హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులుగా ఉన్న ముగ్గురు రాజీనామా చేశారు. న్యాయవాదులు పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్‌బాబు, షేక్ హబీబ్ రాజీనామా చేశారు. అన్ని కేసుల్లో తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండటంతో ముగ్గురు న్యాయవాదుల రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.
న్యాయవాదులను త్వరలో నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. గత కొన్నాళ్లుగా ప్రభుత్వానికి హైకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకే రోజు మూడు సార్లు ప్రభుత్వ నిర్ణయాలను కోర్టు తప్పుబట్టింది. ఏడాది పాలనలో అనేక నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది. విశాఖ డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇంటలిజెన్స్ మాజీ డీజీ వెంకటేశ్వరరావుకు కోర్టులో ఊరట లభించగా, గ్రామ సచివాలయాలకు రంగుల విషయంలో హైకోర్టు మండిపడింది.
అయితే, ఆయా విషయాల్లో ప్రభుత్వ వ్యూహాలను, వాదనలను సమర్ధంగా కోర్టుకు విన్నవించడంలో సదరు న్యాయవాదులు విఫలమయ్యారని వైసీపీ సీనియర్లు. చెబుతున్నారు. వీరి వాదనలు, కేసుల్లో ప్రతివాదుల తరఫున ఉన్న న్యాయవాదుల వాదనలపై జగన్ ఇటీవల ముగ్గురు సభ్యులతో అంతర్గతంగా అధ్యయనం చేయించి.. ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే మరో పెద్ద వికెట్ కూడా పడిపోతుందనే ప్రచారం సీఎంవో వర్గాల నుంచి వినిపిస్తుండడం గమనార్హం.