కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఖాతాదారులకు ఊరట కలిగించే విషయం త్వరలో చెప్పనుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు చెక్ బౌన్స్ అయితే దాన్ని నేరంగా పరిగణించి శిక్షలు విధించేవారు. కానీ ఇక అలా కాదు.. చెక్ బౌన్స్ అయినా.. దాన్ని నేరంగా పరిగణించరు. అయితే దీనిపై ప్రస్తుతం కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు ఈ విషయంపై తమ నిర్ణయాన్ని తెలపాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది.
కాగా 1988కి ముందు చెక్కు బౌన్స్ అయితే అది అప్పట్లో నేరం కాదు. కానీ దానికి మార్పులు, చేర్పులు చేశారు. అప్పటి నుంచి చెక్ బౌన్స్ అయితే నేరంగా పరిగణిస్తున్నారు. కానీ ఇకపై దాన్ని నేరంగా పరిగణించబోరు. ఇక చెక్ బౌన్స్ అయితే దాన్ని చిన్న నేరం కింద పరిగణించాలని, శిక్షార్హమైన నేరాల జాబితా నుంచి తొలగించాలని కేంద్రం ఆలోచిస్తోంది.
ఇక ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పౌర సంఘాలు, విద్యావేత్తలు ఈ నెల 23వ తేదీ లోగా తమ నిర్ణయాన్ని కేంద్రానికి తెలపాల్సి ఉంటుంది.