“రాష్ట్రంలో మాకు 7.5 శాతం ఓటు బ్యాంకు ఉంది. జనసేనకు 17 శాతం ఓటు బ్యాంకు ఉంది. కాబట్టి ఇతర పార్టీల నుంచి నేతలను తెచ్చుకుని 45 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు మేం ఎందుకు ప్రయత్నించకూడదు. ఇలా ప్రయత్నిస్తే.. తప్పెలా అవుతుంది!“-ఇదీ.. ఇంకా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టక ముందుగానే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు. అయితే, ఆయన ఏడాది తిరిగేలోపే తన ముద్ర పార్టీపై వేసేందుకు ఇక, ఆ రోజు నుంచే ఆయన ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో కీలకంగా ఉన్న నాయకులు, తటస్థులుగా ఉన్న నేతల జాబితాను సిద్ధం చేసుకున్నారు.
అదే సమయంలో వైఎస్సార్ సీపీలోనే ఉండి.. ఎలాంటి గుర్తింపునకు నోచుకోని నేతలకు సంబంధించిన జాబితాను కూడా సోము రెడీ చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. వీరిని ఏదో విధంగాబీజేపీ వైపు మళ్లించుకోగలిగితే.. పార్టీ పటిష్టానికి అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఈవరుసలో సబ్బం హరి, దాడి వీరభద్రరావు, హర్షకుమార్ ( తటస్థంగా ఉన్నారు) వంటి వారి పేర్లు వినిపిస్తున్నారు. ఇలాంటి వారిలో చాలా మంది సరైన ప్లాట్ ఫాం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక, వీరిని బీజేపీలోకి తీసుకువచ్చి పదవులు ఇచ్చుకునేలా ఇప్పటికే ఉన్న వారిలో కన్నా లక్ష్మీనారాయణ వర్గంగా పేరుపడ్డ వారిని ఏదో ఒక కారణం చూపించి తప్పిస్తున్న విషయం తెలిసిందే.
ఇక, ఈ క్రమంలోనే టీడీపీలో ఉండి.. బీజేపీ పాట పాడుతున్నవారి జాబితాను కూడా సోము సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. ఈ వరుసలో మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల పేరు ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీలో నే ఉన్నప్పటికీ.. ఆయన కుమారుడు వస్తే.. ఆహ్వానించేందుకు సోము రెడీ గా ఉన్నారు. అదేవిధంగా అనంతలో జేసీ కుటుంబం, పరిటాల కుటుంబాలను లాగేసేందుకు కూడా వారితో సన్నిహితంగా ఉంటోన్న బీజేపీ నేతలతో లాబీ నడుపుతున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పరిటాల అయినా, జేసీ వాళ్లు అయినా కండువా మార్చేవరకు తాము పార్టీ మారం అనే చెపుతూ ఉంటారు. టైం వచ్చాక గప్‌చుప్‌గానే కండువాలు మార్చేఏస్తారు. ఇక వీరితో పాటు కృష్ణా, గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మంచి పదవులు అనుభవించిన నేతలు.. గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలపై సైతం సోము గురి పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఇక, సీఎం జగన్ సొంత జిల్లాలో ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నారు. ఆయన కాకుండా మరెవరైనా వస్తే..రెడ్ కార్పెట్ పరిచేందుకు సోము రెడీ అవుతున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. సోము ఎంపిక చేస్తున్న జాబితాలో వారంతా .. రాష్ట్ర బీజేపీపై మౌనంగా ఉంటూ.. కేంద్రంలోని బీజేపీని కొనియాడుతుండడం, మోడీని ఆకాశానికి ఎత్తేస్తుండడం గమనార్హం. అంతేకాదు.. వీరిలో చాలా మంది జనసేనకు అత్యంత సానుభూతిపరులు. ఈ రెండు ఈక్వేషన్లను సరిచేసుకుంటూ పోతే..తన వ్యూహానికి తిరుగు ఉండదని సోము భావిస్తున్నట్టు తెలుస్తోంది.