అవును.. పలుచోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. కానీ.. ఆ సమస్యలను చాలావరకు సరిదిద్దాం. అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు వేయండి.. అని ఏపీ సీఈసీ గోపాలకృష్ణ ద్వివేదీ ఏపీ ప్రజలను కోరారు.
ఈవీఎంలలో తలెత్తిన సాంకేతిక సమస్యలను ఎక్కడికక్కడ అధిగమించడానికి ఈసీ చర్యలు తీసుకుంటోందని గోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం 45900 ఈవీఎంలను వినియోగిస్తున్నామని.. వాటిలో 362 ఈవీఎంలలోనే స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తాయన్నారు. వాటిలో 310 ఈవీఎంలను వెంటనే అధికారులు సరిచేశారని ఆయన స్పష్టం చేశారు. మిగితా 52 చోట్ల మాత్రం ఈవీఎంలను మార్చామని ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని.. ఓటర్లు ఎటువంటి భయం, ఆందోళన పెట్టుకోకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ఈసందర్భంగా కోరారు.