రాష్ట్రంలో పెరగుతున్న డ్రగ్స్, గంజాయిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగనుకి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్, మద్యం అమ్మకాల వల్లే రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోందని లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఏమూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని ఆరోపించారు. దీని వల్ల రాష్ట్ర యువత భవిష్యత్ తో పాటు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని ఆనంద్ బాబు లేకలో పేర్కొన్నారు.
కేవలం దొరికిన గంజాయి ఇన్ని లక్షల్లో ఉంటే ఇక దొరకని గంజాయి ఎన్ని లక్షల కిలోల్లో ఉంటుందని లేఖ లో ప్రశ్నించారు. గతంలో విశాఖ మన్యంలో కేవలం వందల ఎకరాల్లో జరిగే గంజాయి సాగు వైసీపీ పాలనలో 15 వేల ఎకరాలకు విస్తరించిందన్నారు. వైసీపీ నేతలు అక్రమ సంపాద కోసం మన్యంలో గంజాయిని వాణిజ్య పంటగా మార్చుకుని అమాయకులైన గిరిజనుల్ని వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. చివరకు ఆన్ లైన్ లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోందని విమర్శించారు.