ఏపీకి ప్రత్యేక హోదా అనేది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… ఏపీలో రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉపయోగపడుతుంది! సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో తప్పించుకోవడానికి కొందరికి కొన్ని రకాలుగా హోదా ఉపయోగపడుతూ.. నాయకులకు కొత్త హోదాలు కూడా తెచ్చిపెట్టింది. ఈ విషయంలో ఏపీకి ప్రత్యేక హోదా అనే విషయాన్ని అటు చంద్రబాబు – ఇటు జగన్ లు ఎలా ఉపయోగించుకుంటున్నారు.. ఎవరు హోదా విషయంలో ఎలా బిహేవ్ చేస్తున్నారనేది ఇప్పుడు గమనిద్దాం!
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో తనదైన “రెండుకళ్ల” సిద్ధాంతంతో ముందుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించి.. మోడీతో కలిసిందే “హోదా” కోసం అని చెప్పుకుని తిరిగారు! అయితే… అది ప్రత్యేక హోదా కాదు.. బాబుకు సీఎం హోదా అని ప్రజలు గ్రహించేలోపు ఎన్నికలు అయిపోయాయి! ఆ కసంతా 2019 ఎన్నికల్లో తీర్చుకున్నారనుకోండి.. అది వేరే విషయం! అనంతరం “హోదా వద్దు – ప్యాకేజీ ముద్దు” అన్నారు.. పంచుకున్నారు!! దీంతో.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయంగా “హోదా” అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు అప్పుడప్పుడూ చేస్తున్నారు!
బాబు “హోదా రాజకీయాలు” అలా ఉంటే… ఈ విషయంలో జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు! అవును… ఎన్డీఏలో గనుక వైకాపా చేరితే సుమారు మూడు కేంద్రమంత్రి పదవులతో పాటు డిప్యుటీ స్పీకర్ పదవి కూడా వరించేది. కానీ… ఈ విషయంలో బాబు స్వార్ధ రాజకీయాలకు, తన రాష్ట్ర ప్రయోజన రాజకీయాలకూ తేడా చేతల్లో చెప్పే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్! ప్రస్తుతానికి బయటనుంచి మద్దతు అనేది అంశాలవారీగా ఇస్తాం కానీ… నేరుగా ఎండీయే లో చేరే ప్రసక్తి లేదని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది! అందుకు కారణం ప్రత్యేక హోదా!!
అవును… జగన్ హస్తిన వెళ్లిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం వద్ద ఆయన చేసే డిమాండ్స్ లో “ప్రత్యేక హోదా” అతి ప్రాముఖ్యమైనదిగా ఉంటూనే వస్తుంది! ఈ క్రమంలో.. తాజాగా మోడీ ఆఫర్ చేసిన కేంద్రమంత్రి పదవులు సైతం తనకు వద్దని.. ఏపీకి హోదా ఇస్తే చాలని జగన్ సూటిగా చెప్పినట్లు సమాచారం! అసలు మోడీ పిలిచి మంత్రి పదవులు అని అంటే… ఈపాటికి చంద్రబాబు అయితే ఏమి చేసేవారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! కానీ… జగన్ ఇలా చెప్పి ఏపీ ప్రజల అభిమానాన్ని మరింతగా చూరగొన్నారని అంటున్నారు విశ్లేషకులు!
-CH Raja