ఏపీ సీఎం జ‌గ‌న్‌కు బి ఫీవ‌ర్ ప‌ట్టుకుందా… ఆ బీ ఎంటి…!

-

ఎ ఫ‌ర్ యాపిల్‌.. బి ఫ‌ర్ బాల్‌.. అని పిల్ల‌ల‌కు ఇంగ్లిష్ నేర్పిస్తుంటారు. కానీ ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మాత్రం బి ఫ‌ర్ భ‌యమ‌ట‌. ఇదేమిటి.. జ‌గ‌న్‌కు బి అంటే భ‌య‌మెందుకు..? అని అనుకుంటున్నారా..? అవును.. బి అక్ష‌రంతో ముడిప‌డి ఉన్న రెండు అంశాలు జ‌గ‌న్‌ను తీవ్రంగా వేధిస్తున్నాయ‌ట‌.  ఆయ‌న‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ‌ట‌. కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి.. రాజ‌కీయ ఉద్దండుల‌ను ఎదుర్కొని.. వైసీపీని తిరుగులేని శ‌క్తిగా తీర్చిదిద్ది.. ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌గ‌న్‌కు బి అంటే భ‌య‌మెందుకు ప‌ట్టుకుందో ఈ క‌థ‌నంతో తెలుసుకుందాం.

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌గ‌న్‌ను కుదురుగా కూర్చోనీయ‌కుండా చేస్తున్న ఆ అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం.. ఇందులో మొద‌టి జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌, రెండోది బోటు ప్ర‌మాదం. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యం.. అంద‌రూ ప్ర‌చారంలో నిమ‌గ్న‌మై ఉన్నారు. అప్ప‌టివ‌ర‌కు ప్ర‌చారం చేసి ఇంటికి వ‌చ్చిన వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. నిజానికి.. వివేకానంద‌రెడ్డి అజాత‌శ‌త్రువ‌ని అంటుంటారు. మ‌రి ఇలాంటి నేత హ‌త్య కేసు మిస్ట‌రీ ఇప్ప‌టివ‌ర‌కూ వీడ‌డం లేదు.  ఇక జ‌గ‌న్‌తో వివేకానంద‌రెడ్డి ఒకేఒక్క‌సారి విభేదించారు.

జగన్ రాజకీయ మొద‌ట్లో పులివెందుల ఉప ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ మీద పోటీ చేసి నిద్ర లేకుండా చేశారు. ఆ త‌ర్వాత వైసీపీలో చేరిపోయారు. ఇక అప్ప‌టి నుంచి బాబాయి, అబ్బాయి క‌లిసిక‌ట్టుగా న‌డిచారు. జగన్ సీఎం కావాలని అవిశ్రాంతంగా శ్ర‌మించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చురుగ్గా పాల్గొన్నారు. అయితే.. జ‌గ‌న్ సీఎం కావ‌డాన్ని ఆయ‌న చూడ‌లేక‌పోయారు. ఏడు నెలల క్రితం జరిగిన వివేకా దారుణ హత్య కేసులో ఇప్ప‌టికీ ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌డం లేదు. దీంతో సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. ఇక సోష‌ల్ మీడియాలో అయితే.. సెటైర్లు పేల్చుతున్నారు.

ఆ త‌ర్వాత జ‌గ‌న్‌కు వేధిస్తున్న ఘ‌ట‌న‌ గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద నెల రోజుల క్రితం జరిగిన బోటు ప్రమాదం. ఈ ప్ర‌మాదంలో ఇంకా 14 మంది మృత‌దేహాల‌ను బయటకు తీయ‌లేదు. బోటు వెలికితీత విష‌యంలోనూ ప్ర‌భుత్వం చేతులెత్తేసింది.  ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై, ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. ఇక ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ఇంతటి అసమర్ధ ప్రభుత్వమా అంటూ చంద్రబాబు జగన్ ని ఆడుకుంటున్నారు.

ఇక ఇదే స‌మ‌యంలో తెలుగు త‌మ్ముళ్లు మ‌రింత‌గా రెచ్చిపోతున్నారు అదే బాబు అధికారంలో ఉంటే రెండు గంటల్లో బోటుని బయటకు తీసేవారని తమ్ముళ్లు అంటున్నారు. ఇలా బాబాయి హ‌త్య కేసు, బోటు ప్ర‌మాదం.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను తీవ్రంగా వెంటాడుతున్నాయి. ముఖ్య‌మంత్రి అయ్యాన‌న్న సంతోషం లేకుండా చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version