సినిమా లేట్ ఎఫెక్ట్‌: హైద‌రాబాద్‌లో థియేట‌ర్‌పై కేసు

-

ఎంచ‌క్కా టిక్కెట్ కొనుక్కుని థియేట‌ర్లోకి సినిమా చూద్దామ‌ని వెళ్లిన ఆ ప్రేక్ష‌కుడికి థియేట‌ర్ వాళ్లు యాడ్లు వేసి చుక్క‌లు చూపించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అత‌డు ఏకంగా పోలీసుల‌కే ఫిర్యాదు చేశాడు. చివ‌ర‌కు ఈ విష‌యం కోర్టు వ‌ర‌కు వెళ్ల‌డంతో ఆ థియేట‌ర్‌పై కేసు పెట్ట‌క త‌ప్ప‌లేదు. ఇంత‌కు ఈ సంఘ‌ట‌న ఎక్క‌డో జ‌ర‌గ‌లేదు…. హైద‌రాబాద్‌లోనే…

నిర్ణీత సమయానికి పది నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రదర్శన ప్రారంభం కావడంతో అసహనానికి గురైన ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్, కేపీహెచ్‌బీ పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 8న స్థానిక మంజీరా మాల్‌లోని మూడో అంతస్తులో ఉన్న సినీ పోలిస్‌లో చాణక్య సినిమాను ప్రదర్శిస్తున్నారు. సినిమా ప్రదర్శన 4:40 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, పది నిమిషాలు ఆలస్యంగా 4.50 నిమిషాల‌కు షో స్టార్ట్ చేశారు.

కాని షెడ్యూల్‌లోనూ, టిక్కెట్ల మీద మాత్రం 4.40 గంట‌ల‌కే షో ఉంటుంద‌ని చెప్పారు. ఆ 10 నిమిషాల పాటు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు వేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు విసుగు తెప్పించడంతోపాటు, తన సమయాన్ని వృథా చేశారని, నియమ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఓ ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై మంగళవారం కోర్టు నుంచి అనుమ‌తి రావ‌డంతో కేసు పెట్టిన‌ట్టు స్థానిక సీఐ చెప్పారు. మ‌రి ఈ కేసులో కోర్టు రియాక్ష‌న్ ఎలా ఉంటుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version