కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌తోపాటు మ‌రో పేరు.. జ‌గ‌న్ మ‌న‌సులో మాట..‌!

-

రాష్ట్రంలోని 13 జిల్లాల‌ను పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ఆధారంగా పెంచి 26 చేయాల‌నేది జ‌గ‌న్ వ్యూహం. ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఇదే విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. మేనిఫెస్టోలో పెట్ట‌లేదు కానీ, జిల్లాల సంఖ్య‌ను మాత్రం పెంచుతామ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే రెండు గిరిజ‌న సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ పాల‌న మ‌రింత చేరువ అవుతుంద‌నేది జ‌గ‌న్ వ్యూహం. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడాదైనా దీనిపై అడుగు వేయ‌లేక పోయింది.

దీనికి ప్ర‌దాన కార‌ణం.. 2021 నాటి జ‌నాభా లెక్క‌లే! ఆ లెక్క‌లు తీసేవ‌ర‌కు కూడా జిల్లాల విభ‌జ‌న స‌హా రెవెన్యూ డివిజ‌న్ల విభ‌జ‌న‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ మొగ్గు చూప‌రాద‌ని కేంద్ర లెక్క‌లు, గ‌ణాంక శాఖ స‌హా ఎన్నిక‌ల సంఘం కూడా రాష్ట్రానికి సూచించింది. దీంతో ఈ ప్ర‌క్రియ‌కు కొంత టైం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రోప‌క్క‌, రాష్ట్రంలో జిల్లాల విభ‌జ‌నకు సంబంధించిన క‌స‌ర‌త్తు ప్రారంభ‌మైంద‌నే ప్ర‌చారం మాత్రం జ‌రుగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే కొత్త‌గా ఏర్ప‌డే జిల్లాల‌కు కీల‌క నేత‌ల పేర్లు పెడ‌తాన‌ని కూడా జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లోనే చెప్పారు.

వీరిలో అత్యంత ముఖ్య‌మైన నాయ‌కుడు టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు నంద‌మూరి తార‌క‌రామారావు ఉన్న విష‌యం తెలిసిందే. కృష్ణాజిల్లాల‌ను రెండుగా చేసి.. ఒక‌దానికి ఆయ‌న పేరు పెడ‌తామ‌ని ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో భాగంగా గుడివాడ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ అప్పట్లో ప్ర‌క‌టించారు. నిజానికి ఇది అప్పట్లో సంచ‌ల‌నంగా మారింది. టీడీపీకి పెను దెబ్బేన‌ని ప్ర‌చారం జ‌రిగింది. నంద‌మూరి కుటుంబం నుంచి కూడా జ‌గ‌న్‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తాయి. తాజాగా జ‌గ‌న్ మ‌న‌సులో ఉన్న మాట ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. కృష్ణాజిల్లాకే చెందిన స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్థంతి జ‌రిగింది.

ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ నివాళులర్పించారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యగారు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం అని ట్విటర్‌లో పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న పేరును కృష్ణాజిల్లాకు పెట్టాల‌ని భావిస్తున్న‌ట్టు త‌న స‌ల‌హాదారుల‌తో చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. ఇదే జిల్లాకు గ‌తంలో ఎన్టీఆర్ పేరును, ఇప్పుడు పింగ‌ళి వెంక‌య్య పేరును ప్ర‌తిపాదించ‌డంతో నిజంగా కృష్ణాజిల్లా ప్ర‌జ‌ల హృద‌యాల్లో జ‌గ‌న్ నిలిచిపోతార‌ని స‌ల‌హాదారులు కొనియాడిన‌ట్టు తెలిసింది. మ‌రి ఎప్ప‌టికి కార్య‌రూపం దాలుస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version