దేశంలో అత్యధిక రుణభారం ఆంధ్రప్రదేశ్ రైతులపైనే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భాగవత్ కరాడ్ తెలిపారు. జాతీయ స్థాయిలో సగటున ఒక్కో రైతు కుటుంబంపై రూ.74,121 అప్పు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో సగటున రూ.2,45,554 చొప్పున ఉందని వెల్లడించారు. ఇది దేశంలో ఒక్కో రైతు కుటుంబం మోస్తున్న రుణ భారంకంటే 231% అధికమని చెప్పారు. సోమవారం రోజున లోక్‌సభలో శిరోమణి అకాలీదళ్ సభ్యుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన ‘సిచ్యుయేషన్ అసెస్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్‌హోల్డ్స్ అండ్ ల్యాండ్ అండ్ లైవ్‌స్టాక్ హోల్డింగ్స్ ఆఫ్ హౌస్‌హోల్డ్స్ ఇన్ రూరల్ ఇండియా 2019’ నివేదిక ప్రకారం ఆయన వివరాలు వెల్లడించారు. దేశంలో రైతులు అత్యధిక రుణభారం మోస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్‌లు టాప్-3లో నిలిచాయి. హరియాణా, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడుల్లోని రైతు కుటుంబాలపై రూ.1లక్షకుపైగా రుణభారం ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని రైతులపై సగటు భారం రూ.లక్షలోపే నమోదైంది.