జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు అకాడమీ పేరులో మార్పు చేసింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ను అకాడమీలో పాలకవర్గ సభ్యుడిగా నియమించింది ప్రభుత్వం.
దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై తెలుగు అకాడమీ పేరు ఎక్కడా కనిపించకుండా పోనుంది. టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు అప్పట్లో తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు అకాడమీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు ప్రభుత్వాలు తెలుగు అకాడమీనే కొనసాగించాయి.
కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక… తెలుగు అకాడమీ పేరును మార్చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై విపక్షాలు, భాషాభిమానులు మండిపడుతున్నాయి. తెలుగు అకాడమీ పేరు మార్చడమంటే తెలుగు భాషకు తెగులు పట్టించడమేనంటూ వారు ఫైర్ అవుతున్నారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.