వరదలపై ఏపీ సిఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ముంపునకు గురైన ప్రతి ఇంటికీ పరిహారం అందాలని.. ఎవ్వరికీ అందలేదన్న మాట రాకూడదని హెచ్చరించారు సిఎం జగన్. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వారికి అందించే సేవల్లో ఎక్కడా లోటు రానీయకూడదని.. ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట వినిపించాలన్నారు.
ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా..వారికి వెంటనే నగదు ఇవ్వండని ఆదేశించారు జగన్. పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 డబ్బు ఇవ్వండని.. దీంతోపాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయాలని ప్రకటన చేశారు. దీనివల్ల వెంటనే పనులు మొదలుపెట్టగలుగుతారని.. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ. 5200 నగదు వెంటనే అందించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 90శాతం మేర నష్టపరిహారం అందించారని.. మిగిలిన వారికి వెంటనే అందించేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు సిఎం జగన్.