ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని సెంట్రల్ జైలును సందర్శించారు. ఆమెకు జైలు అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం జైలులోని ప్రస్తుత పరిస్థితులను హోంమంత్రి అనిత అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వినిపించిన ఘటనపై ఆమె అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
అసలు జైలులోకి గంజాయి ఎలా వచ్చింది? దీని వెనుక ఎవరున్నారనే దానిపై వివరాలు సేకరించాలని అధికారులను హోంమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడిన విషయంపైనా సీరియస్ అయ్యినట్లు సమాచారం. ఖైదీల రక్షణే ముఖ్యమని వెల్లడించిన హోం మినిస్టర్.. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జైలు అధికారులను హెచ్చరించారు.