ఏపీలో మొదలయిన పరిషత్ ఎన్నికలు.. పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత

-

ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితం మొదలైంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది, ఇక ముందే 126 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 6492 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. లెక్క ప్రకారం ఎల్లుండి కౌంటింగ్ ఉంటుంది, కానీ ఎవరు గెలిచారు అనే విషయం మాత్రం కోర్టు ఆదేశాలతో వెల్లడించాల్సి ఉంది. 

 

ఇక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం నాయకులు కర్రలతో వైసీపీ నాయకుల మీద దాడి చేయడంతో కొందరు వైసీపీ నాయకులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. దీంతో టీడీపీ నాయకులు ఇళ్ళ మీద వైసీపీ నేతలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో బైకులు, ఇళ్లలో ఫర్నీచర్ ధ్వంసం అయినట్లుగా చెబుతున్నారు. ఇదే జిల్లాలో మామిడికుదురు మండలం సత్తమ్మ పేటలో కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఇక్కడ వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నలుగురు వైసీపీ కార్యకర్తలకి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.. ఓటర్లకు డబ్బు పంచేందుకు వచ్చిన జనసేన నేతలను వైసీపీ నేతలు అడ్డుకోగా రాళ్ల దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.. ఇక మరోపక్క గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డి గూడెంలో కూడా ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఎన్నికలకు సంబంధించిన డబ్బు పంపిణీ విషయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇరు వర్గాల వాళ్లు కర్రలు రాళ్లతో దాడికి పాల్పడగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆస్పత్రికి తరలించారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోపు వారి పాలెం లో టీడీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. టిడిపి ఏజెంట్లను వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రం వద్దకు రానివ్వడం లేనట్లు సమాచారం. ఏజెంటు ఫారాలు నింపుతున్న సమయంలో వాటిని చింపేసి బయటకు నెట్టేశారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version