విద్యాబుద్ధులు చెప్పే గురువులకు లాఠీలు సమాధానాలు చెప్పాయి. వారి ప్రశ్నలకు వీరు సమాధానాలు రాయడం ఏంటి ? అంటే ప్రభుత్వమే పోలీసులను ఎక్కువగా ప్రోత్సహిస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఆ విధంగా చేస్తే ఆ రోజు చంద్రబాబుకు ఇవాళ జగన్ కు తేడా ఏంటి ?
హక్కుల సాధనకు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రశ్నిస్తారు. నిరసిస్తారు. రోడ్డెక్కి తమ బాధను చెప్పుకునే ప్రయత్నాలేవో చేస్తారు. అసలు మాట్లాడడమే తప్పు అయితే ఆ రోజు పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి ఎన్ని సార్లు అరెస్టు కావాలి ? ఇదే ప్రశ్న యూటీఎఫ్ వేస్తోంది. ఉపాధ్యాయ సంఘం తరఫున తమ బాధను చెప్పుకుంటే తప్పేంటని నిలదీస్తోంది. ఆ రోజు తాము మద్దతు ఇచ్చాం కనుకనే ఈ రోజు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని, ఆ విషయం మరిచిపోకూడదని హితవు చెబుతోంది. ఇవన్నీ మరిచిపోయి పోలీసుల అత్యుత్సాహం కారణంగా తాము నడి రోడ్డు మీద అవమానాలు పడ్డామని అంటున్నారు. ఊళ్లలో గృహ నిర్బంధాలు, రైల్వే స్టేషన్లలో పలు తనిఖీలు ఇవన్నీ తమను మానసికంగా వేదనకు గురి చేశాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
జీతాల పెంపుదలకు సంబంధించి ఛలో విజయవాడ నిర్వహించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆ రోజు ఎంతో విజయం సాధించారు. వేతన సవరణకు సంబంధించి కొన్నయినా సాధించుకున్నారు. కొన్ని సాధించుకోలేకపోయారు కూడా ! అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విన్నపం మేరకు ఆ రోజు స్పందించారు. వెనక్కు తగ్గారు కూడా ! తరువాత పరిణామాల నేపథ్యంలో జగన్ తో పాటు ఇతర మంత్రులు కూడా కొన్ని విషయాలను వారికి వివరించి పంపారు. ఆ పొద్దులో కొన్ని అనరాని మాటలు అన్నా జగన్ కూడా భరించారు. ఏవేవో పేరడీ పాటలు పాడినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఏ విధంగా చూసుకున్నా ఆ రోజు గురువులదే గెలుపు.
పీఆర్సీ రగడ ముగిసినా సీపీఎస్ కు సంబంధించి మాత్రం గొడవ ఇంకా మిగిలే ఉంది. ఆ రోజు జరిగిన చర్చల్లో త్వరలో సీపీఎస్ కు సంబంధించి త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి, ఇందుకు రోడ్డు మ్యాప్ కూడా సిద్ధం చేస్తామని చెప్పి పంపారు.
ఏదీ జరగలేదు. చర్చలు జరిగి నెలలు గడుస్తున్నా తమకు న్యాయం అయితే జరగలేదు అని ఉపాధ్యాయులు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడికి యూటీఎఫ్ పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి భారీ స్థాయిలో ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. కానీ పోలీసుల నిర్బంధాల నేపథ్యంలో అవన్నీ పటాపంచలయ్యాయి. గురువులకు ఘోర అవమానమే మిగిలింది. చదువులు చెప్పే మాస్టార్లకు లాఠీ దెబ్బలే బహుమతులు అయ్యాయి. దీనిపై వివిధ ప్రజా సంఘాలు స్పందిస్తున్నాయి. ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుకు డిమాండ్ చేస్తూ రోడ్డెక్కడం తప్పెలా అవుతుందని పోలీసులనూ మరియు వారిని అతిగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాధిపతినీ ప్రశ్నిస్తున్నాయి.