జనాల మాట ఇది ! జగన్ గారు … మీకు అర్థమవుతోందా ?

-

మాట తప్పను మడమ తిప్పను అంటూ ఎన్నో వాగ్దానాలను జగన్ జనాలకు ఇచ్చారు. పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను, కన్నీళ్లను స్వయంగా చూసిన ఆయన తాను అధికారంలోకి వస్తే , ప్రతి పేదవాడికి అండగా ఉంటానని, మీ బతుకు భరోసాగా నిలుస్తానని ఎన్నో హామీలు ఇచ్చారు.  అసలు వైసీపీ మేనిఫెస్టో తయారయింది పాదయాత్ర సమయంలో స్వయంగా జగన్ చూసిన పరిస్థితులు ఆధారంగానే… జగన్ ఇచ్చిన నవరత్నాలు హామీలు ఇచ్చారు. అసలు జగన్ వాగ్దానాల అమలు సాధ్యమే కాదు అనే అభిప్రాయాలు ఎన్నికలకు ముందు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. కేవలం గెలిచేందుకు మాత్రమే ఈ రకంగా వాగ్దానాలు చేస్తున్నారని అంతా అనుకున్నారు.  వైసీపీ నేతల్లోనూ జగన్ వాగ్దానాలు అమలు సాధ్యం కాదు అనే అభిప్రాయం కలిగింది.

ఇది ఇలా ఉండగా, 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన మొదటి రోజు నుంచి జగన్ ఇచ్చిన వాగ్దానాలు అన్నిటినీ అమలు చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఏడాది లోపే దాదాపు జగన్ ఇచ్చిన వాగ్దానాలు అన్నిటిని అమలు చేయడమే కాకుండా, ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టి జనాల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. గతంలో జగన్ తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రజల పక్షపాతి గా ముద్ర వేయించుకున్నారో జగన్ అంతే స్థాయిలో జనాల్లో స్థానం సంపాదించుకున్నారు. జగన్ ఏపీలో సాగిస్తున్న పరిపాలన ప్రజలకు అందిస్తున్న పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలు, అన్ని దేశవ్యాప్తంగా చర్చ జరగడమే కాక మిగతా రాష్ట్రాలు వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇలా అన్ని విషయాలను జగన్ పనితీరు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఆకట్టుకునేలా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. మాట తప్పను మడమ తిప్పను అంటూ జగన్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారనే అభిప్రాయమూ జనాల్లోనూ కలిగింది. ఇంత వరకు బాగానే ఉన్నా , జగన్ కు అనుకున్నంత స్థాయిలో మైలేజ్ రాకపోవడానికి సొంత పార్టీ నాయకులు కారణం అనే విషయం ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. అవినీతి వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ పదే పదే జగన్ చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో నాయకులు మాత్రం అవినీతి వ్యవహారాల్లో మునిగితేలుతూ, కొన్ని చోట్ల ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

ఇక పార్టీలో గ్రూపు రాజకీయాలు సంగతి సరేసరి. కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలు చేసే చిన్న చిన్న తప్పిదాలను సైతం టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా పదే పదే హైలెట్ చేసి జనాల్లో చర్చ జరిగే విధంగా చేస్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు అడుగడుగున ప్రయత్నిస్తోంది. ఈ తరహా విమర్శలను తిప్పి కొట్టడంలో పార్టీ నాయకులతో పాటు, వైసిపి అనుకూల మీడియా సైతం విఫలమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పనితీరుపై జనాల్లో సానుకూలత ఉన్నా, దానిని హైలెట్ చేసుకోవడంలో, ఆ క్రెడిట్ ప్రభుత్వానికి దక్కకుండా చేసే విషయంలో వైసిపి సక్సెస్ కాలేకపోతోంది అనేది విశ్లేషకుల అభిప్రాయం.

జగన్ ప్రభుత్వ పరిపాలనపైనే కాకుండా, పార్టీ నాయకుల వ్యవహారాలపైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పార్టీని ప్రభుత్వాన్ని రెండు జోడెద్దుల్లా పరిగెత్తిస్తేనే ఫలితం ఉంటుంది అనేది అందరి అభిప్రాయం. జనాల్లోనూ ఇదే రకమైన చర్చ జరుగుతోంది. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అంటూనే జనాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

 

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version