ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, సాధికారత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. యునిసెఫ్‌తో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద మూడు ముఖ్యమైన యువత అభివృద్ధి కార్యక్రమాలు – యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ (YFSI), యూత్ హబ్, పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ (P2E) – రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఉండవల్లిలో జరిగిన కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరై మౌలిక ఒప్పందంపై సంతకాలను చేపట్టారు. ఈ ఒప్పందంతో, యువతలో నూతన ఆవిష్కరణలు, ఆంతర్యాన్ని పెంపొందించడంతో పాటు స్థిర జీవనోపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. ఇంటికో వ్యాపారవేత్త అనే లక్ష్యంతో సాగుతున్న “స్వర్ణాంధ్ర లక్ష్య సాధన”కు ఈ ప్రణాళికలు తోడ్పడతాయి.
యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ పథకం ద్వారా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసిస్తున్న 2 లక్షల మంది యువతకు యునిసెఫ్ గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా వ్యాపార నైపుణ్యాలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. యూత్ హబ్ ద్వారా బహుభాషా డిజిటల్ వేదిక ఏర్పాటై, AP నైపుణ్య పోర్టల్‌తో అనుసంధానించి, యువతకు ఉద్యోగాలు, వాలంటీర్‌షిప్, శిక్షణ అవకాశాలు అందించనుంది. పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ (P2E) ద్వారా 15-29 ఏళ్ల మధ్యవయస్సు గల యువతకు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా డిజిటల్, ప్రొఫెషనల్ నైపుణ్య శిక్షణ అందించనున్నారు.