సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తన నూతన ఐఫోన్.. ఐఫోన్ ఎస్ఈ 2 (ఐఫోన్ 9)ను ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు యాపిల్ తాజాగా తన ఉద్యోగులతో ఓ అంతర్గత సమావేశాన్ని నిర్వహించిందని తెలిసింది. అందులో చర్చించిన మేరకు.. ఐఫోన్ ఎస్ఈ 2 ని ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేసేందుకు యాపిల్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఐఫోన్ ఎస్ఈ ని యాపిల్ 2016లో విడుదల చేయగా.. ఇప్పుడు ఐఫోన్ ఎస్ఈ 2ని ఆ సంస్థ విడుదల చేయనుంది. అయితే దీనికి ఐఫోన్ 9 అని కూడా పేరు పెట్టేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మార్చి 31వ తేదీనే యాపిల్ ఓ ఈవెంట్‌ను నిర్వహించి అందులో ఈ ఫోన్‌ను లాంచ్ చేయాలని చూసింది. కానీ కరోనా వల్ల ఆ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయారు. అసలు దానిపై యాపిల్ కనీసం ప్రకటన కూడా చేయలేదు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 15వ తేదీనే.. ఐఫోన్ ఎస్ఈ 2ని యాపిల్ విడుదల చేస్తుందని తెలిసింది.
ఇక ఐఫోన్ ఎస్ఈ 2 ఫోన్‌లో.. ఐఫోన్ 8ను పోలిన డిస్‌ప్లేను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే అందులో 3డీ టచ్‌ను ఇవ్వడం లేదట. దానికి బదులుగా వేరే ఆప్షన్‌ను అందివ్వనున్నట్లు సమాచారం. అలాగే ఫేస్ ఐడీ ఫీచర్‌ను కూడా అందివ్వనున్నట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్‌ను యాపిల్ రూ.30వేల లోపు ధరకే విక్రయించాలని అనుకుంటుందట. అలాగే ఏప్రిల్ 15న ఈ ఫోన్‌ను విడుదల చేస్తే.. ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించవచ్చని తెలిసింది. ఇందుకు గాను ఆయా దేశాల్లో ఉన్న తమ ఆథరైజ్డ్ డీలర్లతో యాపిల్ ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పష్టత రావాలంటే.. మరికొన్ని రోజుల వరకు వేచి చూడక తప్పదు..!