చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్ ఇటీవలే నిషేధించిన విషయం విదితమే. అయితే ఆ ఘటన మరువక ముందే చైనా గేమ్ యాప్‌లకు మరో పెద్ద దెబ్బ తగిలింది. యాపిల్ యాప్ స్టోర్‌లో ఉన్న చైనాకు చెందిన 4500 మొబైల్ గేమ్ యాప్‌లను యాపిల్ తొలగించింది. భారత్ ఇచ్చిన షాక్ తరువాత చైనాకు సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఈ విధంగా మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది.
ఇప్పటికే కరోనా మహమ్మారితో చైనా ప్రపంచ దేశాల నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇంతలో భారత్‌లో సరిహద్దు వద్ద కయ్యానికి కాలుదువ్వి భంగపడింది. ఇక తాజాగా భారత్ 59 యాప్‌లను నిషేధిస్తూ చైనాకు గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో యాపిల్ ఇలా చైనాకు చెందిన 4500 మొబైల్ గేమ్ యాప్‌లను యాప్ స్టోర్ నుంచి తొలగించడం చైనాలో మరింత కలవరాన్ని పెంచింది. దీనిపై చైనా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే నిబంధనల ప్రకారమే తాము ఇలా చేశామని యాపిల్ స్పష్టతనిచ్చింది.
సదరు మొబైల్ గేమ్ యాప్స్‌ను చట్టపరమైన అనుమతి లేకుండా యాప్ స్టోర్‌లో ఉంచారని అందుకనే అలాంటి యాప్‌లను మాత్రమే తొలగించామని యాపిల్ ఈ విషయమై స్పష్టమైన ప్రకటన చేసింది. గతేడాదే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నామని, అందుకనే ఇప్పుడు దాన్ని అమలు చేశామని, ఇప్పుడు కొత్తగా ఈ నిర్ణయం తీసుకోలేదని యాపిల్ తెలిపింది. ఇక యాప్‌ల డెవలపర్లు చట్ట ప్రకారం అనుమతులు పొంది దరఖాస్తు చేస్తే మళ్లీ వారి యాప్‌లను యాప్‌స్టోర్‌లో పెట్టేందుకు అనుమతులు ఇస్తామని యాపిల్ వెల్లడించింది. ఏది ఏమైనా.. చైనాకు మాత్రం వరుసగా షాక్‌ల మీద షాకులు తగులుతుండడం విశేషం.