రెండు రోజుల కిందట టికెట్ల ధరలు పెంచి.. షాక్‌ఇచ్చిన ఏపీ ఆర్టీసీ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. రాబోయే మూడు నెలల్లో సమూల మార్పులకు సిద్ధం అయింది. ఇప్పటి వరకు పాతబడిన బస్సులను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 11, 271 బస్సులు ఉంటే.. వీటిలో 3500 కు పైగా బాగా పాతబడ్డాయి. వీటితో సమస్యలు ఎదురవుతున్నాయి.
వీటి స్థానంలో కొత్త బస్సులను తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్తగా అద్దె బస్సులను ప్రవేశపెట్టడంతో పాటూ.. ప్రస్తుతం ఉన్న బస్సులను ఫేస్ లిఫ్ట్ ప్రక్రియ చేయాలని పేర్కొన్నారు.
దాదాపు 2 వేల డీజిల్ బస్సులను ఈ- బస్సులుగా మార్చేందుకు సిద్దమయ్యారు. ఆర్టీసీ త్వరలో కొత్తగా 998 బస్సులను అద్దె విధానంలో తీసుకురాబోతుంది. ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ చేపట్టి.. వచ్చే నెల రెండో వారం నాటికి పూర్తి చేసేందుకు సిద్దమయ్యారు. జూలై చివరికి కొత్త బస్సులు రోడ్డెక్కుతాయని అధికారులు చెబుతున్నారు.