ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ రికవరీ రేటు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. మన దేశంలో కోవిడ్ రికవరీ రేటు 85 శాతంగా ఉంది. అయితే ఇది సంతోషించాల్సిన విషయమే అయినప్పటికీ.. కోవిడ్ వచ్చి ఆ వ్యాధి నుంచి కోలుకున్న పేషెంట్లలో కొన్ని నెలల వరకు ఇతర అనారోగ్య సమస్యలు వస్తుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్నాక రోగ నిరోధక వ్యవస్థ శక్తి చాలా తక్కువగా ఉంటుంది కనుక రికవరీ అయ్యాక 2-3 నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా కోవిడ్ నుంచి రికవరీ అయిన వారిలో కేవలం 13 నుంచి 14 శాతం మంది మాత్రమే పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటున్నారని, మిగిలిన వారిలో ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుందని అంటున్నారు. కోవిడ్ సోకడం వల్ల గుండె, ఊపిరితిత్తు, కిడ్నీలపై ఎక్కువగా ప్రభావం పడుతుందని, కనుక కోవిడ్ నుంచి కోలుకున్నాక ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కోవిడ్ నుంచి రికవరీ అయ్యాక 2-3 నెలల పాటు ఆరోగ్యంగా ఉంటే ఓకే. లేదంటే ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని అంటున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక చాలా మందికి నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్, తీవ్ర అలసట, ఆకలి లేకపోవడం, వాసనలు పసిగట్టకపోవడం, దగ్గు రావడం, ఛాతిలో నొప్పిగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం, తలతిప్పినట్టు ఉండడం, నీరసంగా అనిపించడం, మాటలు పలకడంలో ఇబ్బందులు ఎదురు కావడం.. వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. కనుక కోవిడ్ నుంచి కోలుకున్న ఎవరైనా సరే పైన తెలిపిన సమస్యలు, లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయి.