అస‌ని : అదిగో ఇంకొన్ని వాన‌లు.. మాన్సూన్ ఎఫెక్ట్

-

తీవ్ర ఉక్క‌పోత‌ల న‌డుమ కాలం వెచ్చిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అస‌ని ఓ విధంగా ఉప‌శ‌మ‌నం ఇచ్చింది. తీవ్ర‌గాలులన్న‌వి మొన్న‌టి వేళ అంటే కొంత ఇబ్బందుల‌కు గురిచేసినా, త‌రువాత కురిసిన వాన‌లు కాస్తో కూస్తో ప్ర‌జ‌ల‌కు ఊర‌ట నిచ్చాయి. సాధార‌ణంగా మే లో తుఫానులు ఏర్ప‌డే అవ‌కాశ‌మే ఉండదు. ఏర్ప‌డిన అవి స‌ముద్రంలో పుట్టి, అక్క‌డే అంత‌ర్థానం అయిపోతాయి.

కానీ ఈ సారి తుఫాను మాత్రం పలు సార్లు దిశ‌ను మార్చుకుని చాలా గంద‌ర‌గోళాన్నే సృష్టించింది. అస‌ని లెక్క ఒకంత‌ట తేల‌లేదు. ముందుగా బాప‌ట్ల ద‌గ్గ‌ర తీరం దాటుతుంద‌ని అనుకున్నారు కానీ ఆఖ‌రికి మ‌చిలీప‌ట్నానికి స‌మీపాన తీరం దాటి ఉప‌శ‌మ‌నం ఇచ్చింది.

తుఫాను ప్ర‌భావంతో వాతావ‌ర‌ణంలో కొంత అన‌నుకూలత ఉన్నా, కొంత వ‌ర‌కూ మెరుగ‌యిన ఫ‌లితాలు కూడా ఉన్నాయి. ఇక తీవ్ర తుఫానుల‌ను అంచ‌నా వేయ‌డంలో మాత్రం ఈ సారి వాతావ‌ర‌ణ శాఖ చాలా అంటే చాలా క‌న్ఫ్యూజ్ అయింది. మూడు రోజుల ప్ర‌భావం అనంత‌రం మ‌రో వార్త ఒక‌టి అందింది. అదే ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండ‌నుంది.. మాన్సూన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండ‌నుంది అన్న వివ‌రాలు ఇప్పుడున్న భౌగోళిక స్థితిగ‌తుల ఆధారంగా చూస్తే ఓ స్ప‌ష్ట‌త‌కు రానున్నాయి.

వాతావ‌ర‌ణ శాఖ అందిస్తున్న నివేదిక అనుసారం ఈ నెల‌లోనే నైరుతి ప‌ల‌క‌రిచ‌నుంది. ఈ నెల 15 నాటికి అండ‌మాన్ – నికోబార్ దీవుల‌ను తాక‌నుంది. వ‌చ్చే నెల మొద‌టివారంలోనే నైరుతి ఆంధ్ర రాష్ట్రాన్ని చేరుకోనుంది. ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్ కార‌ణంగానే ఈ నెల 15 నుంచి వాన‌లు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ విభాగం అంటుంది. అందుకే రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఖ‌రీఫ్ అంతా సిద్ధం కావాల‌ని ఆదేశాలు ఇస్తోంది. వ‌ర్షాలు ఈ ఏడాది స‌మృద్ధిగా ప‌డే అవ‌కాశాలే కోకొల్ల‌లు క‌నుక ఖ‌రీఫ్ సీజ‌న్ ను కాస్త ముందుకు జ‌రిపితే నవంబ‌ర్ నాటి తుఫానుల నుంచి సులువుగా ఒడ్డెక్క‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version