విడిపోయి ఆనందంగా ఉండాలన్నది తెలంగాణ వాదుల భావన. వేర్పాటు అయ్యాక తాము బాగుపడలేం అని అప్పట్లో సమైక్య వాదుల భావన. సరే ఎవరి వాదన వారిది. వీటికి ప్రజా స్వామ్య స్ఫూర్తిని ఆపాదించారు కొందరు పత్రికల అధినేతలు, ఎడిటర్లు.ఆ విధంగా తెలంగాణ ఓ వైపు ఉండిపోయింది. నెగ్గి వెళ్లి సొంత రాష్ట్రం ప్రత్యేక రీతిలో దక్కించుకుంది. మాట నెగ్గించుకుంది. ఇదే సమయాన విభజన నాటికి లక్ష కోట్ల అప్పుతో నవ్యాంధ్ర ఏర్పాటు అయింది.
అయితే అప్పులతో ఓ రాష్ట్రం ఆరంభం అవ్వడం ఎంత మాత్రం మంచిది కాదని అప్పట్లో వాదనలు వచ్చేయి. కానీ ఎందుకనో ఆ అప్పును మాఫీ చేయలేదు అదేవిధంగా ఉమ్మడి ఆస్తుల లెక్క కూడా తేల్చలేదు. ఏ మాటకు ఆ మాట కేసీఆర్ మాత్రం ఆంధ్రాకు వచ్చిన తొలిసారి (విభజన తరువాత అమరావతి ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు) ఎంతో కొంత సాయం చేయాలనుకున్నది మాత్రం వాస్తవం. ఆ మాట కేటీఆర్ పలు సభల్లో చెప్పారు కూడా !
ఆ రోజున్న పరిణామాల రీత్యా అవి సాధ్యం కాలేదు. ఆ విధంగా కేసీఆర్ చేయాలనుకున్న సాయం చేయకుండానే వెళ్లిపోయారు. ఇక నవ్యాంధ్ర లో అమరావతి నిర్మాణల లెక్క ఎలా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన బకాయిలు (విద్యుత్ బిల్లుల బకాయిలు మూడు వేల కోట్లకుపైగా) ఇప్పటిదాకా ఇవ్వనేలేదు. ఓటుకు నోటు కేసు పుణ్యమాని ఇటుగా వచ్చేసిన బాబు తనదైన శైలిలో రాజకీయం చేశారే కానీ ఉమ్మడి రాజధాని పై మనకున్న హక్కులు వదిలి వచ్చానే అన్న భావనతో అయితే లేరు. ఎలా చూసుకున్నా భాగ్యనగరి అన్నది పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానే ! కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 2024తో ఉమ్మడి రాజధాని కాలం కూడా ముగియనుంది. అంటే భాగ్యనగరితో ఆంధ్రా బంధం సాంకేతికంగా తెగిపోనుంది. అప్పుడున్న పరిణామాల ప్రకారం ఉమ్మడి రాజధానిని పెంచుతారా లేదా అన్నది కేంద్రం ఇష్టం. అది కూడా ఇప్పుడే తేల్చలేం.
తొలుత చెప్పుకున్న విధంగా ఎవరి దారి వారిదే కనుక బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అప్పులు లెక్క తేలిపోయింది. ఇప్పటిదాకా నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని తేలింది. ఇక ఏపీ అప్పు ఈ మూడేళ్లకే ఎనిమిది లక్షల కోట్లు. అంటే మొత్తం 12 లక్షల కోట్లు అని తేలిపోయింది. అంటే విడిపోయి ప్రాంతాలు సాధించిన ప్రగతి ఎలా ఉన్నా మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ కూడా ఇప్పుడు రుణ భారమే మోయాల్సి వస్తుంది.
అదేవిధంగా అప్పులతో ఆరంభం అయిన ఆంధ్రా కూడా అదేవిధంగా రుణాలను తలకు మించి తీసుకుంటూ తరుచూ కేంద్రం దగ్గర తలొగ్గి చేయి చాచాల్సి వస్తుంది. ఇదీ ఇవాళ్టి వాస్తవిక చిత్రం. వీటిపైనే కేఏపాల్ కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వీటిపైనే మిగతా లీడర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమయినప్పటికీ అప్పు అన్నది ప్రగతి నిరోధకం అన్నది అంగీకరించక తప్పదు. సంక్షేమ పథకాల పేరిట అప్పులు పుట్టవు అన్నది ఓ వాస్తవం కానీ వేరే విషయాలపై అప్పులు తీసుకుని వాటిని సంక్షేమ పథకాల కోసం వెచ్చించండం కూడా ఓ విధంగా ఆర్థిక సంబంధ నేరమే !