టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. ఆర్టీసీలో కేంద్రానికి 30 శాతం వాటా ఉంటుందని, కార్పొరేషన్‌ను మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో అఖిలపక్ష నాయకులతో జేఏసీ నేతల సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. ఆర్టీసీని మూసివేయాలంటే కేంద్రం అనుమతి ఉండాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవన్నారు. కార్మికులెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. చర్చలకు పిలవకుండా కార్మికులను భయపెట్టేలా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని డెడ్‌లైన్లు పెట్టినా సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. భైంసా డిపో మేనేజర్‌పై దాడికి ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదని, డిపో మేనేజర్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు.