సమ్మె వల్ల ఆర్టీసీ కుటుంబాలు పండుగలు జరుపుకోకపోవడం బాధాకరమని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అశ్వత్ధామ రెడ్డి స్పష్టం చేశారు. చర్చలకు తాము ఆలస్యంగా వెళ్లామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము రెండు గంటల 15నిమిషాలకే ఎర్ర మంజిల్ చేరుకున్నామని తెలియజేశారు. టీఎమ్‌యూ కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
సీనియర్ ఐఏఎస్ అధికారులే ఆలస్యంగా వచ్చారు. అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. చర్చలకు ఎప్పుడు పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. ఈ నెల 29న సకల జనుల సమరభేరి కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. సంస్ధ శ్రేయస్సు, కార్మికుల ప్రయోజనాల కోసం తాము చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలంటూ ఆయన కోరారు.