ఆస్తి తగాదాలు కుటుంబంలోని పెద్ద ప్రాణాలు మీదకు తీసుకొచ్చాయి. ఆస్తి పంపకాల్లో తేడా రావడంతో సొంత అన్న మీదే తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని ఎల్బీనగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఉంటున్న ఐలోని చిరంజీవి కుటుంబంలో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే శనివారం రాత్రి గిర్మాజీపేటలో ఉండే తమ్ముడు శంకర్.. అన్న ఐలోని చిరంజీవి మీద కత్తితో దాడికి పాల్పడ్డాడు. వరంగల్ చౌరస్తా ప్రాంతంలోని బందిల్ స్ట్రీట్ సత్యం కంప్యూటర్స్ సమీపంలో ఈ హత్యాయత్నం జరిగింది. తమ్ముడి దాడిలో గాయపడిన చిరంజీవికి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాధిత వ్యక్తి చిరంజీవి పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు. చిరంజీవి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.