ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్‌లో మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నారాయణ్‌పూర్- దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. దక్షిణ అబుజ్‌మాద్‌లోని అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.
కూంబింగ్ నిర్వహిస్తుండగా భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. బదులుగా వారు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా జిల్లా రిజర్వ్ గార్డ్ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్ కూడా మరణించినట్లు సమాచారం. ఘటనా స్థలి నుంచి నలుగురు మావోయిస్టుల మృతదేహాలు, ఏకే-47 రైఫిల్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ సహా భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.