తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియా ముందు చంద్రబాబు కుటుంబం ఆస్తులను ప్రకటించారు. చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నారా లోకేష్, నారా దేవాన్ష్ ఆస్తులను ప్రకటించారు. గత ఏడాది ఆస్తులు, వాటిలో వచ్చిన పెరుగుదల, పెరిగిన అప్పులు, తగ్గిన అప్పులు, పెరిగిన ఆదాయం, నికర ఆస్తుల్లో వచ్చిన మార్పులు ఇవన్ని ప్రత్యేకంగా దేనికి అది ప్రకటించారు.
ఇప్పుడు దీనిపై భినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి ఇది ప్రచారం చేసుకోవడానికి బాగుంది. ఆస్తులను ధైర్యం గా ప్రకటించి తమలో ఉన్న నిజాయితీని చాటుకున్నాం అని టీడీపీ నేతలు అంటారు. చంద్రబాబు నిజాయితీ కి ఇదే అదనపు బలం అంటున్నారు. జగన్ ఆస్తులను సిబిఐ ప్రకటిస్తే మా ఆస్తులను మేమే ప్రకటిస్తాం అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఎక్కువగా కామెంట్స్ చేస్తూ వస్తుంది.
సరే అది పక్కన పెడితే, ఇప్పుడు ఇదే విమర్శలకు వేదికగా మారింది. కావాలని టీడీపీ పులిహోర కలుపుతుందని, మరి ఎన్నికలలో ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ కూడా అదే అంటుంది. మరి వందల కోట్ల రూపాయలను టీడీపీ నేతలు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారని, పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఏది ఎలా ఉన్నా సరే ఇది టీడీపీకి కొన్ని విధాలుగా కలిసి వస్తుంది. 9 నెలల జగన్ పాలనలో ఎక్కడా చంద్రబాబు అవినీతిని బయటపెట్టలేకపోవడం ఒకటి అయితే, కేంద్రం కూడా చంద్రబాబు మీద ఐటి దాడులు చేసినా ఏమీ పట్టుకోలేకపోవడం మరొకటి. జగన్ కూడా ఆస్తులను ప్రకటిస్తే బాగుంటుంది అంటున్నారు వైసీపీ నేతలు. ఏది ఎటు చూసినా ఇది టీడీపీకి ప్లస్ అనే అభిప్రాయమే వినపడుతుంది.