తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ అమ్మవారిని మనస్ఫూర్తిగా రెండు విషయాలు కోరుకున్నానని తెలిపారు. 44 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు విడుదల కావాలని, కరవు బారిన పడిన రాష్ట్ర ప్రజలు కోలుకునే శక్తిని ఇవ్వాలని తల్లిని ప్రార్థించాను అని వెల్లడించారు.
అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలుగు జాతి ఆస్తి..దేశం ప్రపంచం నలుమూలల తెలిసే విధంగా మన పిల్లలను ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని… చంద్రబాబు మీద ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దొంగ కేసులను, సంబంధం లేనటువంటి కేసులను బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
అమ్మవారు దయ చూపి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని, తెలుగు జాతి ముందుండాలని పరితపించిన వ్యక్తిని, త్వరగా విడుదల కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పుకొచ్చారు. 100ఏళ్ల చరిత్రలో భారతదేశంలో ఎప్పుడు ఇటువంటి కరువు పరిస్థితి లేదు అని అన్నారు. రైతులు వ్యవసాయమంతా కరువుతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. సాగునీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు అని మండిపడ్డారు. పశువులకి పశుగ్రాసం కూడా లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. కరువు బారి నుంచి త్వరగా ప్రజలు భయటపడి కోలుకునే విధంగా శక్తిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్ని కేసులు బనాయించిన చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.