రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై దారుణాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు.పగలు, రాత్రి అనే తేడా లేకుండా అత్యాచారయత్నాలకు పాల్పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మద్యం మత్తులో ఓ యువకుడు మహిళను వెంబడించాడు.చీకటిగా ఉండే ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంకు వద్దకు వెళ్లగానే ఆమెను అందులోకి లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు.
ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆ మహిళను రక్షించారు. ఆ యువకుడికి దేహశుద్ది చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రిళ్లు మహిళలు ఒంటరిగా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా ఫాలో అయినట్లు అనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.