అదనపు ఆదాయం కోసం ఆటోడ్రైవర్‌ వినూత్న ఆలోచన.. భలే వర్కవుట్‌ అయింది..!

-

కరోనా మహమ్మారి ఎన్నో బతుకులను ఛిద్రం చేసింది. ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగాలను పోగొట్టింది. అయితే ఇప్పుడిప్పుడే ఆంక్షలను సడలిస్తుండడంతో కార్మికులు ఏదో ఒక విధంగా పనిచేసి మళ్లీ కుటుంబాలను పోషించుకోవాలని చూస్తున్నారు. కానీ ఆటోవాలాల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. కరోనాకు ముందు లెక్కకు మించి ప్రయాణికులను తీసుకెళ్లే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరిని మించి ప్రయాణికులను తీసుకెళ్లడం కష్టంగా మారింది. దీంతో అది వారి ఆదాయంపై ప్రభావం చూపిస్తోంది.

అయితే ఈ విధంగా ప్రయాణికులను తీసుకెళ్తే వచ్చే డబ్బులతో కుటుంబాన్ని ఎలా పోషిస్తాం ? అని భావించిన ఆ ఆటోడ్రైవర్‌ వినూత్న ప్రయోగం చేశాడు. తన ఆటో వెనుక భాగంలో చిన్నపాటి దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అందులో సిగరెట్లు, వాటర్‌ బాటిల్స్‌, బిస్కెట్లను అమ్మడం మొదలు పెట్టాడు. దాంతో వాటిని అమ్మడం ద్వారా అతనికి వచ్చే ఆదాయం కొద్దిగా పెరిగింది. అలా కొంత వరకు తన ఆదాయాన్ని పెంచుకుని ప్రస్తుతానికి సమస్యల నుంచి గట్టెక్కానని ఆటోడ్రైవర్‌ అబ్దుల్‌ సమద్‌ చెబుతున్నాడు.

అబ్దుల్‌ సమద్‌ తమిళనాడులోని కోయంబత్తూర్‌లో నిత్యం ఆటో నడిపిస్తాడు. ప్రయాణికులను ఎక్కించుకుని గమ్యస్థానాలకు చేరుస్తాడు. అయితే ఆటో నడపని సమయంలో రోడ్డు పక్కన దాన్ని ఆపి వెనుక ఉండే షాపును తెరుస్తాడు. దీంతో అతని షాపులోని వస్తువులకు గిరాకీ పెరుగుతోంది. ఫలితంగా నిత్యం రూ.200 నుంచి రూ.250 వరకు అదనంగా సంపాదిస్తున్నానని, అది కొంత వరకు తన ఆదాయాన్ని పెంచిందని, లేదంటే కేవలం ఆటో నడపడం ద్వారా వచ్చే ఆదాయం తనకు ఏమాత్రం సరిపోయేది కాదని అతను చెబుతున్నాడు. ఏది ఏమైనా.. అబ్దుల్‌ వేసిన ప్లాన్‌ భలేగా వర్కవుట్‌ అయింది కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version