మన జీవితంలో 30 ఏళ్ల వయస్సు ఒక కీలకమైన మైలురాయి. అప్పటివరకు ఉన్న స్వేచ్ఛ, ఉల్లాసం స్థానంలో బాధ్యత, స్థిరత్వం వస్తాయి. ఈ దశలో మనం తీసుకునే నిర్ణయాలు, అలవాటు చేసుకునే జీవనశైలి భవిష్యత్తు ప్రశాంతతను నిర్ణయిస్తాయి. అయితే తెలియక చేసే కొన్ని తప్పులు సుదీర్ఘ కాలంలో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందుకే 30 వయసులలో అప్రమత్తంగా ఉండటం ఈ పదిలమైన మలుపు వద్ద సరైన ఎంపికలు చేసుకోవడం చాలా అవసరం. ఈ వయస్సులో చేయకూడని ముఖ్యమైన తప్పులు ఏమిటో తెలుసుకుందాం.
ఆర్థిక విషయాలలో నిర్లక్ష్యం: 30లలో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఆర్థిక ప్రణాళికను నిర్లక్ష్యం చేయడం. ఈ వయసులో కూడా కేవలం EMI లు కట్టడంపైనే దృష్టి పెట్టి, పెట్టుబడులు ప్రారంభించకపోవడం భవిష్యత్తు ప్రశాంతతకు పెద్ద ఆటంకం. ఉద్యోగం/వ్యాపారం నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని పదవీ విరమణ కోసం, అత్యవసర నిధి కోసం కేటాయించాలి. క్రెడిట్ కార్డు అప్పులు లేదా అధిక వడ్డీ రుణాలను నిర్లక్ష్యం చేయడం కూడా పెద్ద తప్పు.

ఆరోగ్య సంరక్షణను వాయిదా వేయడం: ఈ దశలో శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు (జంక్ ఫుడ్, అధిక కొవ్వు పదార్థాలు, స్వీట్లు) పెంచడం చాలా ప్రమాదకరం.30లలో మెటబాలిజం రేటు తగ్గడం మొదలవుతుంది, దీనివల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. రోజువారీ వ్యాయామం సరైన నిద్రను నిర్లక్ష్యం చేయడం భవిష్యత్తులో ఖరీదైన చికిత్సలకు దారితీస్తుంది. అలాగే సంవత్సరానికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం కూడా పెద్ద పొరపాటు.
కొత్త నైపుణ్యాలను నేర్చుకోకపోవడం: మారుతున్న ప్రపంచంలో, నేర్చుకోవడం ఆపడం అంటే వెనుకబడిపోవడమే. 30లలో తమ వృత్తిపరమైన నైపుణ్యాలను (Professional Skills) లేదా సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోని వారు కెరీర్ వృద్ధిలో వెనుకబడతారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయం కేటాయించాలి లేదంటే భవిష్యత్తులో మీ ఉద్యోగానికి భద్రత తగ్గుతుంది.
అపరిష్కృత సంబంధాలు: కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో ఉన్న పాత విబేధాలను లేదా సమస్యలను పరిష్కరించుకోకుండా అలాగే ఉంచడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యక్తిగత సంబంధాలను సరిదిద్దుకోవడం, ముఖ్యమైన వ్యక్తులకు సమయం కేటాయించడం మానసిక ప్రశాంతతకు చాలా ముఖ్యం. ‘వయసు ఒత్తిడి’ కారణంగా సరైన వ్యక్తి కోసం వెతకకుండా తొందరపడి పెళ్లి చేసుకోవడం లేదా సంబంధాలకు కట్టుబడటం కూడా పెద్ద తప్పు.
30ల వయస్సు అనేది మన భవిష్యత్తు గమనాన్ని నిర్ణయించే దశ. ఈ సమయంలో ఆరోగ్యం, ఆర్థికం, కెరీర్, సంబంధాలు అనే నాలుగు స్తంభాలపై దృష్టి పెట్టడం ద్వారా మనం ఒక స్థిరమైన, సంతోషకరమైన జీవితానికి గట్టి పునాది వేయగలుగుతాం. పైన చెప్పిన తప్పులను నివారించి బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుంటే మీ మున్ముందు జీవితం తప్పకుండా ప్రశాంతంగా విజయవంతంగా సాగుతుంది.