ఈ “ఫోటోలు” చూసి, “డైలాగులు” విని మాట్లాడు చినబాబు!

-

చినబాబుకు మాటలు నేర్పినవారిని అనాలో లేక తెలుగు నేర్పిన వారిని అనాలో తెలియదు కానీ… రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వారిని మాత్రం అనాలి అని ఫీలవుతున్నారంట తమ్ముళ్లు! ఎందుకంటే ఎన్నికల సమయంలో తమ ట్యాలెంట్ తో సొంతపార్టీని ఇరుకున పెట్టిన చినబాబు… “మందలగిరి” లో తనను తానే ఇబ్బంది పెట్టుకున్నారు! అయితే తాజాగా మరోసారి టీడీపీ నేతలు తలదించుకునేలా ప్రసగించారు.. తాను మారలేదని, మారలేనని నిరూపించే ప్రయత్నం చేశారు!

అవును… వరదప్రాంతాల్లో పర్యటిస్తాను అని మొదలుపెట్టిన లోకేష్ తాజాగా కోస్తా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మైకందుకున్న లోకేష్… వైకాపాని ఉద్దేశించి పిల్ల కాంగ్రెస్ అని పలికారు. దీంతో తలలు పట్టుకున్నారు టీడీపీ నేతలు! పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయకుండా.. కేంద్రం వద్ద తాకట్టు పెట్టేశారని మొదలుపెట్టిన చినబాబు… పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారో లేదో పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. దీంతో కీప్యాడ్ లకు, కీ బోర్డులకు పని చెప్పారు నెటిజన్లు!

అసలు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ఎన్‌డీఏ నుంచి బ‌య‌టికొచ్చి ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోస‌మంటూ కాంగ్రెస్‌తో చేతులు క‌లిపిన చరిత్ర కలిగిన టీడీపీ ని పిల్ల కాంగ్రెస్ అనాలా లేక కాంగ్రెస్ పార్టీని ఎదురించి పోరాడి నిలిచి గెలిచిన వైకాపా ను పిల్ల కాంగ్రెస్ అనాలా అంటూ ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు!

పైగా జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని తామే పూర్తిచేస్తామని, తగుదునమ్మా అంటూ చేతకాని చేవలేని పనిని చేతిలోకి తీసుకుని… “రాసుకో జగన్.. పోలవరం పూర్తి చేస్తున్నాం” అని అసెంబ్లీ సాక్షిగా ఢాంబికాలు పలికిన టీడీపీ నేతలు… కాపర్ డ్యాం కట్టి, ప్రాజెక్టును 90శాతం పూర్తి చేసుకున్న రేంజ్ లో కబుర్లు చెప్పుకొచ్చిన టీడీపీ నేతలు… పోలవరం గురించి ప్రశ్నించే నైతిక హక్కునే కోల్పోయిన పరిస్థితిలో.. చినబాబు ఇలాంటి సాహసోపేతమైన అజ్ఞానపు పలుకులు ఎందుకు పలుకుతున్నారంటూ తమ్ముళ్లు ఫీలవుతున్నారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన కొన్ని పనికిమాలిన పనులను, తప్పుడు నిర్ణయాలను ప్రజలు కొద్దో గొప్పో మరిచిపోతారులే అని మిగిలినవారంతా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మక మౌనం ప్రదర్శిస్తుంటే… గతంలో తాము చేసిన పాపాలన్నీ పిలిచి మరీ చెప్పి గుర్తు చేస్తున్నారనేది మరికొందరు తమ్ముళ్ల వాదన! మరి చినబాబు వీరి వేదన, ఆవేదనను అర్ధం చేసుకుంటారా లేక తనకు మాత్రమే సొంతమైన ఈ పాండిత్యాన్ని కొనసాగించి.. “శుభం” కార్డు వేసేస్తారా అనేది వేచి చూడాలి!!

 

Read more RELATED
Recommended to you

Exit mobile version