విశాఖలో స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాస్ నిరాహారదీక్షకు అయ్యన్న సంఘీభావం తెలిపారు. జగన్ మోహన్ రెడ్డితో పోస్కో ప్రతినిధులను కలిసిన ఫోటోలు విడుదల చేసిన అయ్యన్న, పోస్కో సిఎమ్డీకి జగన్ సన్మానం చేసిన ఫోటోలు బహిరంగ వేదికపై బయట పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను అమ్మే హక్కు ఎవరిచ్చారు ? అని ప్రశ్నించారు. 3 లక్షల కోట్లు విలువచేసే ప్రాజెక్టును కారుచౌకగా అమ్మేస్తారా ? అని ప్రశ్నించిన అయన రాజ్యసభలో గనుల శాఖ మంత్రి సమాధానంతో విజయసాయిరెడ్డి బండారం బైటపడిందని అన్నారు.
పూనేలో వున్న పోస్కో ప్రతినిధులను నాలుగైదు సార్లు విజయ సాయిరెడ్డి కలిశారు…. ఆధారాలు మా దగ్గర ఉన్నాయని ఆయన అన్నారు. మీకు తెలీకుండానే స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తారా ? అని ప్రశ్నించిన ఆయన వైఎస్ హయాంలో ఫ్యాక్టరీయే రాని బ్రాహ్మణి స్టీల్ కు గనులు ఎలా కేటాయించారని, మరి స్టీల్ ప్లాంట్ కు గనులు ఎందుకు ఇవ్వలేదు ? అని అయన ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఇప్పటికైనా దోపిడీలు ఆపాలన్న ఆయన స్టీల్ ప్లాంట్ మీద చేయివేస్తే ప్రజలు తరిమికొడతారని, గ్రామాల్లో కూడా స్టీల్ ప్లాంట్ ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొందని అన్నారు.