కరోనా వైరస్, లాక్ డౌన్.. ఆ చిరువ్యాపారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా పరిస్థితి మారలేదు. దీంతో ఆ వృద్ధుల బతుకు బండిప్రమాదంలో పడింది. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా అద్బుతాన్ని చేసింది. ఓ చిన్న పోస్ట్… మనసులను కదిలించింది. అంతే రాత్రికి రాత్రే వారి జీవితాలు మారిపోయాయి.
ఢిల్లీలోని సౌత్ జోన్ మాలవీయనగర్ ప్రాంతమిది. ఇక్కడ కాంతాప్రసాద్, బాదామీ దేవి దంపతులు.. చిన్న కొట్టు పెట్టుకుని జీవితం సాగిస్తున్నారు. చిరుద్యోగులు, రిక్షా, ఆటోకార్మికులు, రోజు కూలీలు… వీరి కొట్టువద్ద టిఫిన్ చేసేవారు. లాక్ డౌన్ ముందు వరకూ వారికి వ్యాపారం బాగా జరిగేది. విపత్తులా వచ్చి పడిన కరోనా వైరస్, లాక్ డౌన్ తో .. గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా జనం రాకపోవడంతో.. తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వీరి పరిస్థితి చూసిన స్థానిక ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్.. అక్టోబర్ 7న తన బ్లాగ్‌లో వీరి గురించి వీడియో అప్‌లోడ్ చేశాడు. రుచికరమైన దాల్, సబ్జీ చేసినా తినేవాళ్లు రాకపోవడంతో, వ్యాపారం జరగక, పూట గడవడమే కష్టంగా ఉందని ఇందులో కాంతాప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యాడు. అతి తక్కువ ఖర్చుతో రుచికరమైన లంచ్ చేయండి, వృద్ధ దంపతులను ఆదుకోండి, అంటూ సోషల్ మీడియాలో వేలాది విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.
అంతే… మరుసటిరోజు, నగరం నలుమూలల నుంచి వచ్చిన కస్టమర్లు.. వృద్ధ దంపతుల ధాబా ముందు క్యూ కట్టారు. ఊహించని ఈ పరిణామంతో ఆనందంతో వృద్ధ దంపతులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అక్టోబరు 8 నుంచి పెద్ద ఎత్తున యువతీయువకులు బాబా కా ధాబాకు వచ్చి ఉదయం అల్పాహారం, భోజనం రుచి చూస్తున్నారు. రోజు 7 నుంచి 8 వేల రూపాయల బిజినెస్ జరుగుతుందని కాంతా ప్రసాద్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు “బాబా కా ధాబా” తన వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ఔత్వాహికులు ధాబా కు లోగో రూపొందించే పనిలో ఉన్నారు..