ఇంగ్లీష్ మీడియంకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మాతృభాష దినోత్సవం సందర్భంగా ఆయన రెండు ట్వీట్లు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాతృ భాషను చంపేందుకు ప్రయత్నిస్తుందని చంద్రబాబు తెలిపారు. మాతృభాష ఇతర భాషలను నేర్చుకోవడానికి పునాది వంటిదని చంద్ర బాబు ట్వీట్ లో పేర్కొన్నారు. ఆయన ట్వీట్ ఈ మేరకి ఉంది.
”ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు! ప్రతి ఒక్కరికీ పుడుతూనే దక్కే వారసత్వ సంపద మాతృభాష. శ్రీ కృష్ణ దేవరాయల వంటి స్వదేశీయుల నుండి సి.పి.బ్రౌన్ వంటి విదేశీయులను కూడా ఆకర్షించిన తెలుగు భాష, వైసీపీ పాలకుల దృష్టిలో చులకనవడం దురదృష్టకరం అని అన్నారు. ఇతర భాషలను నేర్చుకోడానికి పునాది మాతృభాష. ఆ పునాదినే లేకుండా చేసి గాలిలో మేడలు కడతామనేవారిని ఏమనాలి? ఆంగ్ల మాధ్యమానికి తెలుగుదేశం వ్యతిరేకం కాదు. ఏ మాధ్యమంలో చదువుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉండాలన్నదే తెలుగుదేశం అభిమతం అని ఆయన అన్నారు.