క‌రోనా ఎఫెక్ట్‌.. బ్యాంకుల్లో బ్యాడ్ లోన్స్ భారీగా పెరిగే అవ‌కాశం..!

-

క‌రోనా వైర‌స్‌, లాక్‌డౌన్ కార‌ణంగా ఇప్ప‌టికే దేశంలో ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌తనం దిశ‌గా అడుగులు వేస్తోంది. లాక్‌డౌన్‌ను ఇప్ప‌టిక‌ప్పుడు ఎత్తేసినా.. ప‌రిస్థితి గాడిలో ప‌డాలంటే అందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆర్థిక‌వేత్త‌లు అంటున్నారు. ఇక రుణాల చెల్లింపుదారుల‌కు మార‌టోరియం కింద మే 31వ తేదీ వ‌ర‌కు స‌దుపాయం క‌ల్పించినా.. ఆ త‌రువాత కూడా చాలా మంది రుణాలు చెల్లించే స్థితిలో ఉండ‌ర‌ని, దీంతో బ్యాంకుల్లో బ్యాడ్ లోన్స్ భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా సెప్టెంబ‌ర్ 2019 నాటికి భార‌తీయ బ్యాంకులు ఇచ్చిన రుణాల విలువ రూ.9.35 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంది. ఇది ఆయా బ్యాంకుల ఆస్తుల్లో 9.1 శాతంగా ఉంది. ఈ క్ర‌మంలో క‌రోనా కార‌ణంగా ఆ శాతం 18 నుంచి 20 వ‌ర‌కు పెరుగుతుంద‌ని అంచనా వేస్తున్నారు. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా అనేక మంది ఉద్యోగాల‌ను, ఉపాధిని కోల్పోవ‌డం, రుణాలు తిరిగి చెల్లించే స్థితి లేక‌పోవ‌డంతో రానున్న కాలంలో బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉండే రుణాల సంఖ్య భారీగా ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇక బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో 20 నుంచి 25 శాతం వ‌ర‌కు బ‌కాయి రుణాలు డిఫాల్టర్ ప్ర‌మాదాన్ని ఎదుర్కొనే అవ‌కాశం ఉంటుంద‌ని కూడా నివేదిక‌లు చెబుతున్నాయి. గ‌తంలో 90 రోజుల వ్య‌వ‌ధి దాటాకే రుణాన్ని ఎన్‌పీఏగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉండేది. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితిలో దాన్ని 180 రోజుల‌కు పెంచారు. అయితే ఆ త‌రువాత అయినా అన్ని రంగాలు య‌థావిధిగా కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తాయా, ఆర్థిక సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డ‌తారా.. రుణాల‌ను అంద‌రూ చెల్లిస్తారా..? అనేది సందేహంగా మారింది. ఏది ఏమైనా క‌రోనా లాక్‌డౌన్‌ వ‌ల్ల బ్యాంకుల్లో భ‌విష్య‌త్తులో పెద్ద ఎత్తున రుణ ఎగ‌వేత‌లు ఉంటాయ‌ని మ‌న‌కు చూచాయ‌గా తెలుస్తోంది. మ‌రి ఆ స్థితి వ‌స్తే బ్యాంకులు ఏం చేస్తాయో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version