కరోనా నేపథ్యంలో భారతీయ రైల్వే కేవలం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే వాటిల్లోనూ కరోనా జాగ్రత్తలతో ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దీంతో ప్రయాణికుల రవాణా ద్వారా రైల్వేకు వస్తున్న ఆదాయానికి భారీగా గండిపడింది. అయితే రైలు సర్వీసులు ప్రస్తుతం తక్కువగానే నడుస్తున్నప్పటికీ ఇప్పుడప్పుడే పూర్తి స్థాయిలో రైళ్లు నడిచే అవకాశం లేదని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
గతేడాది ఇదే సీజన్‌లో రైల్వేకు ప్రయాణికుల రవాణా ద్వారా రూ.53వేల కోట్ల ఆదాయం వచ్చిందని, కానీ ప్రస్తుతం రూ.4600 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వచ్చిందని, వచ్చే ఏడాది మార్చి వరకు మరో రూ.15వేల కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. అయితే గతేడాదితో పోలిస్తే ప్రయాణికుల రవాణా ద్వారా రైల్వేకు 87 శాతం తక్కువ ఆదాయం వచ్చిందన్నారు. ఈ క్రమంలో కరోనా వల్ల రైల్వేకు భారీగా నష్టం ఏర్పడిందన్నారు.
అయినప్పటికీ సరుకు రవాణా ద్వారా రైల్వే కొంత వరకు ఆదాయాన్ని తెచ్చుకుంటుందని యాదవ్ స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం 1089 ప్రత్యేక రైళ్లు నడుస్తుండగా, కోల్‌కతా మెట్రో 60 శాతం రైల్వు సర్వీసులను, ముంబై సబర్బన్ 88 శాతం రైళ్లను, చెన్నై సబర్బన్ 50 శాతం రైళ్లను నడిపిస్తోంది. అయితే కరోనా వల్ల ప్రత్యేక రైళ్లలో ఆక్యుపెన్సీ కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే నమోదవుతుందని అధికారులు తెలిపారు. అయితే ఇప్పట్లో పూర్తి స్థాయిలో రైళ్లు నడిచే అవకాశం లేదని యాదవ్ స్పష్టం చేశారు.