బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్దం అయ్యింది. మరి కొన్ని గంట ల్లో జరిగే బద్వేల్ ఉపఎన్నికల కోసం అధికారయంత్రాంగం సర్వం సిద్దం చేసింది. బద్వేల్ ఉపఎన్నిక లో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే వాటిలో 148 సమస్యాత్మక మరియు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. దాంతో బద్వేల్ ఎన్నికల కోసం 15 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ , అదనపు బలగాలు మాత్రమే కాకుండా 2 వేల మందితో పోలీసు బందో బస్తును ఏర్పాటు చేశారు.
పోలింగ్ విధులకు 1124 మంది సిబ్బందిని సైతం ఏర్పాటు చేయడం జరిగింది. బద్వేల్ నియోజకవర్గం లో మొత్తం 2.12,730 మంది ఓటర్లు ఉన్నట్టు సమాచారం. అంతే కాకుండా వారిలో పురుషులు 1,06,650 మంది కాగా మహిళలు 1,06,069 మంది, ఇతరులు 20 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా ఉప ఎన్నికల్లో వైసీపీ నుండి దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమని సుధ బరిలోకి దిగుతున్నారు. కాగా బీజేపీ నుండి సురేష్ పంతల బరిలో దిగుతున్నారు.