బీజేపీ దీక్ష… బాల్క సుమ‌న్ స్ట్రాంగ్ కౌంటర్

-

తెలంగాణ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ “తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష” పేరుతో బీజేపీ సోమవారం నిరసన దీక్ష చేపట్టిన విషయం తెల్సిందే. ఈ బీజేపీ దీక్షపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్పందించారు. మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామ‌ని అన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంత‌రం ప‌ని చేస్తున్నార‌ని అన్నారు. దేశంలోనే రైతుల వద్ద నుండి అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసింది తెలంగాణ ప్ర‌భుత్వ‌మే అని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ళలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని ఆయన స్ప‌ష్టం చేశారు.

ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో బీజేపీ నేత‌లు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని బాల్క సుమ‌న్ మండిప‌డ్డారు. బీజేపీ నాయ‌కుడు బండి సంజ‌య్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఫైర్ అయ్యారు. రైతు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ చేసే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల‌ని హితవు పలికారు. లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టికీ రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామ‌ని స్పష్టం చేసారు.

బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా బాల్క సుమ‌న్ హెచ్చరించారు.బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోక పోవడంతోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో పాటు, ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నేతలకు ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు మంజూరు చేయించాలని అన్నారు. వ్యాక్సిన్ పంపిణి విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాలని బీజేపీ నేతలను బాల్క సుమ‌న్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version