ఈ దీపావళికీ నో టపాసులు.. దిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

-

దిల్లీ సర్కార్ తీసుకున్న ఓ కీలక నిర్ణయంతో కొందరు ఖుష్ అవుతుంటే.. మరికొందరు మాత్రం నిరాశ చెందారు. ముఖ్యంగా పిల్లలు అసంతృప్తి చెందుతున్నారు. ఇంతకీ అదేంటంటే.. గతేడాది మాదిరి ఈ ఏడాది కూడా దీపావళికి టపాసులు కాల్చొద్దని సర్కార్ అల్టిమేటమ్ జారీ చేసింది. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు దీపావళి పర్వదినం సమయంలో టపాసులపై పూర్తి నిషేధం విధించింది. జనవరి 1, 2023 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. ఈ మేరకు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ బుధవారం వెల్లడించారు.

‘‘అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు, వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తున్నాం. అప్పుడే ప్రజల ప్రాణాలను కాపాడగలం’’ అని గోపాల్ రాయ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఈ సారి ఆన్‌లైన్‌ విక్రయాలపై కూడా ఆంక్షలు విధించినట్లు మంత్రి తెలిపారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుండగా.. జనవరి 1, 2023 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు త్వరలోనే కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version