టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర అభియోగాలతో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన వ్యవహారంతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు మొదటి నుంచీ చెబుతున్నారు.
తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తనకు సంబంధం లేదని లక్ష్మీ నరసింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి సీఎం కేసీఆర్పై బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల కేసులో సీఎం కేసీఆర్ లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు తలదించుకునే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారన్న ఆయన.. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ బీజేపీని అప్రతిష్ఠ పాలు చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.