తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే యాక్టివ్ అవుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టిడిపి రెడీ అవుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో టిడిపి సత్తా చాటడం కష్టం…పట్టుమని ఒక సీటు కూడా గెలవడం కష్టం. కానీ టిడిపి కొన్ని సీట్లలో గెలుపోటములని మాత్రం ప్రభావితం చేయగలదని చెప్పవచ్చు. టిడిపి పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి అవకాశం ఉంది. అది ఎవరికి నష్టం చేస్తుందనేది చూడాలి.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం జిల్లా పరిధిలో టిడిపి ప్రభావం ఎక్కువ ఉంది. అయితే నెక్స్ట్ బిజేపితో టిడిపి పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతుంది. టిడిపి కలిస్తే గ్రేటర్, ఖమ్మంలో బిజేపికి ప్లస్ అవుతుందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్రమంలో పొత్తుపై ఇప్పటికే తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితుల్లోనూ పొత్తు ఉండదని, బిజేపి ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
కానీ మళ్ళీ మళ్ళీ అదే అంశంపై చర్చ వస్తుంది..ఈ క్రమంలో మరొకసారి బండి స్పందిస్తూ.. తెలంగాణలో సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయని, బీజేపీని అడ్డుకునేందుకే బీఆర్ఎస్..కాంగ్రెస్ కలుస్తున్నాయని బండి అన్నారు. అయితే ఎవరు కలిసినా..తాము మాత్రం సింహం లాగా ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. అంటే టిడిపితో పొత్తు ఉండదని బండి తేల్చేశారు.
అటు జనసేనతో కూడా పొత్తు గురించి ఏ మాత్రం మాట్లాడటం లేదు. అంటే జనసేనతో కూడా పొత్తు ఉండదనే అంశం తెలుస్తుంది. అయితే తెలంగాణలో టిడిపి, జనసేన కొన్ని సీట్లలో ప్రభావం మాత్రం చూపగలవు. ఈ రెండు పార్టీలు సపోర్ట్ ఉంటే బిజేపికి కాస్త లాభం ఉంటుంది..అదే సమయంలో బిఆర్‌ఎస్ పార్టీకి నష్టముందని చెప్పవచ్చు. ఈ రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి బిఆర్‌ఎస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది.
ఎందుకంటే హైదరాబాద్ లో సెటిల్ అయిన ఏపీ ప్రజలు బిజేపి కంటే బిఆర్‌ఎస్ వైపే ఎక్కువ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బిఆర్‌ఎస్ మెజారిటీ సీట్లు సాధించడానికి కారణం అదే. అలాగే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సైతం ఏపీ ఓటర్లు ఉన్న డివిజన్లలోనే బిఆర్‌ఎస్ ఎక్కువ గెలిచింది. అంటే ఇప్పుడు టిడిపి, జనసేన పోటీ చేస్తే బిఆర్‌ఎస్ పార్టీకే నష్టం.
అందుకే బండి కూడా పొత్తుపై వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. తమతో పొత్తు లేకపోయినా , ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే బిఆర్‌ఎస్ పార్టీకే నష్టమని అంచనా వేస్తున్నారు.