నేతల మాటలతో గ్రేటర్ వార్ హీటెక్కుతున్నది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామన్న ప్రభుత్వం, ఎకరాలున్న హుస్సెన్ సాగర్ 700 ఎకరాలకు కుచించికు పోయిందని, అందులో నిర్మించిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఘాట్, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఘాట్లను కూల్చేయాలని సవాల్ విసిరారు.
దీనిపై స్పందించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవ్వాల పీవీ ఘాట్ను సందర్శించారు. పీవీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఘాటు స్పందించారు. పీవీ నర్సింహారావు, ఎన్టీ రామారావు తెలుగు జాతి నిత్యం స్ఫూర్తిగా తీసుకునే మహనీయులు అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందరి మనన్నలు పొందిన గొప్ప వ్యక్తులన్నారు. అలాంటి మహనీయుల ఘాట్లను ఎంఐఎం కూల్చివేస్తామనడం సిగ్గు చేటన్నారు. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చేస్తామన్న సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. ఎంఐఎం పార్టీపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. పీవీ శతజయంతి ఉత్సవాలు జరుపుతున్న టీఆర్ ఎస్ పార్టీ ఆయన ఘాట్ను కూల్చేస్తామన్నా ఎందుకు స్పందించడం లేదని అన్నారు. పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ బీజేపీ పార్టీ నాయకులు కాదని, దేశం కోసం, ప్రజల కోసం పని చేసిన గొప్ప వ్యక్తులుగా వారిని మా పార్టీ గౌరవిస్తుందన్నారు. పీవీ ఘాట్కు, ఎన్టీఆర్ ఘాట్కు భారతీయ జనతా పార్టీ రక్షణగా ఉంటుందన్నారు. వారి ఘాట్లను ముట్టకుంటే తెలుగు జాతి, బీజేపీ కార్యకర్తలు తమ దమ్మేంటో చూపిస్తారని అన్నారు.