సీఎం అత్యుత్సాహం కారణంగా తెలంగాణ రైతులు గందరగోళానికి గురవుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఏ పంట వేయాలో, ఏ పంట వేయకూడదో రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదని ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. చివరికి కలెక్టర్లు కూడా వరి పండించవద్దని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో వరి వేస్తే ఉరే అని సీఎం ఎందుకు అన్నారని ప్రశ్నించారు. ఒక మంత్రి వరిని కొనమని అంటే, మరో మంత్రి కొనుగోలు చేస్తామని చెబుతూ రైతుల్లో గందరగోళం కలిగిస్తున్నారన్నారు. గతంలో సన్నాలు వేయాలని సూచించిన ప్రభుత్వం తర్వాత రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఒకసారి పత్తి వేయాలని, మరోసారి వద్దు అని ప్రణాళికల లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. పంట నష్టపోయిన రైతులను ఈ ప్రభుత్వం ఏనాడైనా ఆదుకుందా అని ప్రశ్నించారు. లక్ష కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం దానిపై శ్వేతపత్రం విడుదలు చేసే దమ్ముందా అని సవాలు విసిరారు.