బీజేపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా కేసులు పెడితే ఊరుకోమని.. భయమంటే ఏంటో చూపిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అ«ధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్‌ఎస్‌కు హెచ్చరించారు. కేసీఆర్ ఆదేశాలతోనే ఐజీ ప్రభాకర్ రావు హాలియా సభలో బీజేపీ కార్యకర్తలపై కేసులు బనాయించి భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే తాను మరోసారి గుర్రంబోడు తాండకు వెళ్తానని దమ్ముంటే తాము ఎప్పుడెళ్తామో కనుక్కోవాలంటూ ఛాలెంజ్ చేశారు. గుర్రంబోడు తాండ వాసుల సమస్యలపై ఆందోళనకు దిగితే పోలీసుల సాయంతో బీజేపీని అణచివేసేందుకు సీఎం కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పోలీసులు మఫ్టీలో వచ్చి తమ పార్టీ కార్యకర్తలను తీసుకెళ్తున్నారని.. నిర్మల్‌లో సునిత నాయక్, జనగామలో మరో బీజేపీ కార్యకర్తలను తీసుకెళ్లారని పేర్కొన్నారు.
జిల్లాలు తిరుగుతూ..
రాష్ట్రంలోని జిల్లాలన్నీ తిరుగుతూ పోలీసులు తమ కార్యకర్తలు, నాయకులపై దౌర్జన్యాలు చేస్తూ భయపెడుతున్నారని సంజయ్ ఆరోపించారు.ఇదంతా ఐజీ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అన్నారు. సీఎం, ఐజీ మాటలు విని తమ కార్యకర్తను ఇబ్బందులకు గురిచేస్తే అధికారులు ఇబ్బందులు పడుతారని 2023 లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందని అది గుర్తు పెట్టుకోవాలన్నారు. టీఆర్‌ఎస్ మంత్రులు, ‘ఎమ్మెల్యేల చిట్టా బయటకు లాగుతున్నాం, ములయంసింగ్ యాదవ్, కరుణానిధి, లాలూప్రసాద్ యాదవ్ పరిస్థితి త్వరలో మీకు కూడా వస్తుందని’ మీ పార్టీ మంత్రులే మీ పై తిరగబడేలా చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. గుర్రంబోడు ఘటనలో కేసులు పెట్టడం ఆపి, ఇంత వరకు పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు.